Srikanth Reddy: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు 6 d ago

AP: వైఎస్ జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. జెడ్ ప్లస్ కేటగిరి ఇస్తున్నామని చెప్పి సరైన భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని, గతంలో గుంటూరు, కర్నూలు పర్యటనలో కూడా భద్రత కల్పించలేదని పేర్కొన్నారు. జగన్‌ను లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని, భద్రత కల్పిస్తే హెలికాఫ్టర్ వద్దకు అంత మంది ఎలా వస్తారని ప్రశ్నించారు. చట్టానికి లోబడి పని చేసే పోలీసులకు సెల్యూట్ చేస్తామని, ఊడిగం చేసే వాళ్లకు యూనిఫాం లేకుండా చేస్తామని హెచ్చరించారు. హోం మంత్రి అనిత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదన్నారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, మనిషికి విలువలు ఉండాలని చెప్పారు. పర్యటన నేపథ్యంలో ముందే సమాచారం ఇచ్చినా భద్రత కల్పించడం లేదని, ఇంటి వద్ద కూడా ఆయనకు భద్రత లేదన్నారు. జగన్ భద్రతపై కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. కురుబ లింగమయ్యను చంపడం బాధాకరమని, కార్యకర్తలను చంపుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని, మహిళలకు కూడా భద్రత లేదని పేర్కొన్నారు.